వరుణ్ తేజ్ తో సినిమా అందుకే ఆగిపోయింది

October 09, 2020 06:21: AM

ప్రతి దర్శకుడికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఓ హీరోతో సినిమా అనుకొని ఆఖరి నిమిషంలో ఆగిపోవడం లాంటి అనుభవాలు ఎదురవుతాయి. దర్శకుడు విజయ్ కుమార్ కొండాకు కూడా అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి వరుణ్ తేజ్ తో సినిమా. వరుణ్ తేజ్ తో చేయాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయిందో గ్రేట్ ఆంధ్రకు ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు విజయ్ కుమార్.

“వరుణ్ తేజ్ తో ఓ సినిమా కోసం ట్రావెలింగ్ జరిగింది. వరుణ్ కు కథ బాగా నచ్చింది. నాగబాబుకు కూడా నచ్చింది. అయితే అన్నీ మన చేతిలో ఉండవు కదా. అంతా బాగానే ఉందనుకున్న టైమ్ కు వరుణ్ తేజ్ కు యాక్సిడెంట్ అయి కాలికి దెబ్బ తగిలింది. బెడ్ రెస్ట్ తప్పలేదు. పైగా డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేయాలని వరుణ్ అప్పట్లో డెసిషన్ తీసుకున్నాడు. అన్నీ లవ్ స్టోరీస్ అవుతున్నాయని నాకు నో చెప్పారు.”

గతంలో వరుణ్ తేజ్ తో సినిమా చేయలేకపోయినా.. భవిష్యత్తులో కచ్చితంగా అతడితో సినిమా చేస్తానంటున్నాడు విజయ్ కుమార్. అయితే ఈ లిస్ట్ లో కేవలం వరుణ్ తేజ్ మాత్రమే లేడని.. మరో ముగ్గురు హీరోలతో కూడా ఇలానే సినిమాలు ఆగిపోయాయని అంటున్నాడు.

“ఒరేయ్ బుజ్జిగా సినిమాకు ముందు 3 ప్రాజెక్టులు ఆగిపోయాయి. దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. ఇక ఎల్లుండి నుంచి స్టార్ట్ అనుకున్న దశలో కూడా ఆగిపోయాయి. అయితే అలా ఆగిపోవడానికి నేను రీజన్ కాదు, నా స్క్రిప్ట్ రీజన్ కాదు. కొన్ని అలా జరుగుతాయంతే.”

అయితే ఏ హీరోలతో ఆ సినిమాలు ఆగిపోయాయనే విషయాన్ని విజయ్ కుమార్ చెప్పలేదు. మళ్లీ ఆ హీరోలతో వర్క్ చేయాలని, తప్పకుండా వాళ్లతో సినిమాలు చేస్తానని చెబుతున్నాడు.

రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా తీసిన ఒరేయ్ బుజ్జిగా సినిమా వచ్చేనెల 2న నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత నెల రోజులకు డైరక్ట్ గా జీ తెలుగులో ప్రసారం చేయబోతున్నారు.