పెళ్లి చేసుకోవ‌డం ఓ బుద్ధి త‌క్కువ ప‌నిః పూరీ

October 09, 2020 07:39: AM

పెళ్లి చేసుకోవ‌డ‌మంత బుద్ధి త‌క్కువ ప‌ని మ‌రొక‌టి లేద‌నే అర్థంలో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ అభిప్రాయ‌ప‌డ్డారు. “పూరీ మ్యూజింగ్స్”   పేరుతో ఆయ‌న త‌న వాయిస్ ఓవ‌ర్‌తో ఆడియోల‌ను విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. ఒక టాపిక్‌ను ఎంచుకుని వినూత్నంగా త‌న అభిప్రాయాల్ని వెల్ల‌డించ‌డం పూరీ ఉద్దేశం. ఇందులో భాగంగా పెళ్లిపై ఆయ‌న వెల్ల‌డించిన అభిప్రాయాలు వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల ఓటు హ‌క్కుపై ఇదే రీతిలో వెల్ల‌డించిన అభిప్రాయాలు వివాదాస్ప‌దం కావ‌డం తెలిసిందే.

ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తే పెళ్లిపై ఆయ‌న ఏమ‌న్నారో తెలుసుకుందా. జీవితంలో ఒక ల‌క్ష్యాన్ని ఎంచుకుని, దాన్ని సాధించాల‌నే త‌ప‌న‌, ప‌ట్టుద‌ల ఉన్న‌వాళ్లెవ‌రూ పెళ్లి జోలికి వెళ్లొద్ద‌ని సూచించారు. భార్య‌ను వ‌దిలేయ‌డం వ‌ల్లే రాజుల కుర్రాడు బుద్ధ‌డ య్యాడ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

“పెళ్లిళ్ల‌కు పోయే కాలం ద‌గ్గ‌ర ప‌డింది. పెళ్లి అంత మంచిదైతే ఏసుక్రీస్తు ప‌ది పెళ్లిళ్లు చేసుకునేవారు.  పెద్ద పెద్ద ఆలోచనలుంటే ఎవరికీ తాళి కట్టొద్దు. ప్రపంచమంతా తిరగాలి, ఏమైనా సాధించాలనే కసి, పట్టుదల మీకుంటే కాళ్లకి పారాణి మాత్రం రాసుకో వద్దు. ఎలాగూ నేను బుర్ర తక్కవ వాడినే, మా ఆవిడ పకోడీలు చేస్తే తింటా, సీరియల్ చూస్తా అని మీరు అనుకుంటుంటే.. వెంట‌నే మీ శుభలేఖ నాకు పంపించండి.

నేను వచ్చి ఆశీర్వదిస్తా. జ్ఞానులెవరూ పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్న వారందరూ పెళ్లి కాని బాబా కాళ్ల మీదే పడతారు. పెళ్లి కాని హీరోయిన్‌కు ఉన్న ఫాలోయింగ్ పెళ్లి అయిన హీరోయిన్‌కు ఉండదు. కాబట్టి మిమ్మ ల్ని మీరు తాడుతో కట్టేసుకోకండి” అని పూరీ సెల‌విచ్చారు.

పూరీ వెల్ల‌డించిన అభిప్రాయాల‌పై నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. పూరీ వాస్త‌వాల్ని క‌ళ్ల‌కు క‌ట్టార‌ని కొంద‌రు …. ఇలాగైతే ఈ సృష్టి సంగ‌తేంట‌ని మ‌రికొంద‌రు త‌మ‌త‌మ అభిప్రాయాల్ని వెల్ల‌డించారు. మొత్తానికి పెళ్లిపై ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు పూరీ జ‌గ‌న్నాథం కార‌ణ‌మ‌య్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.