`సుల్తాన్‌` మూవీ రివ్యూ

April 02, 2021 20:47: PM

:

న‌టీన‌టులు: కార్తీ, ర‌ష్మిక మంద‌న్న‌, నెపోలియ‌న్‌, అభిరామి, లాల్‌, కేజీఎఫ్ రామ‌చంద్ర‌రాజు, యోగిబాబు, స‌తీష్‌, హ‌రీష్ పెరాది, న‌వాబ్ షా, అర్జ‌ల్‌, సింగంపులి త‌దిత‌రులు న‌టించారు.
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బ‌క్కియ‌రాజ క‌న్న‌న్‌‌
నిర్మాత‌లు: ఎస్‌.ఆర్‌. ప్ర‌కాష్‌బాబు, ఎస్‌.ఆర్‌, ప్ర‌భు‌
సంగీతం: వివేక్ – మ‌ర్విన్‌
నేప‌థ్య సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా‌
సినిమాటోగ్ర‌ఫీ : స‌త్య‌న్ సూర్య‌న్‌ ‌
ఎడిటింగ్‌: : రూబెన్‌
రిలీజ్ డేట్‌: 02-04-21

ప్ర‌యోగాత్మ‌క చిత్రం `ఖైదీ`తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు హీరో కార్తీ. ఈ మూవీ త‌రువాత ఆయ‌న త‌న పంథా మార్చుకుని కొత్త క‌థ‌ల్ని ఎంచుకుంటున్నారు. తాజాగా కార్తీ న‌టించిన మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `సుల్తాన్‌`. ప్రచార చిత్రాల్లో చెప్పినట్టే మ‌హాభారతంలో పాండ‌వుల ప‌క్షాన నిలిచిన శ్రీ‌కృష్ణుడు కౌర‌వుల ప‌క్షాన నిలిస్తే ఏం జ‌రిగింది? అన్న ఆస‌క్తిక‌ర‌మైన డైలాగ్‌తో ఈ సినిమా క‌థ ఆసక్తిక‌రంగా వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ట్రైల‌ర్‌తో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా? .. కార్తీ ఖాతాలో మ‌రో విజ‌యాన్ని అందింయిందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:

విక్ర‌మ్ అలియాస్ సుల్తాన్ (కార్తీ) ఓ రోబోటిక్ ఇంజినీర్‌. ముంబైలో చ‌దువు పూర్తి చేసుకున్న త‌ను జ‌పాన్ వెళ్లి అక్క‌డ సొంతంగా కంప‌నీ పెట్టాల‌నుకుంటాడు. అదే విష‌యాన్ని త‌న తండ్రి సేతుప‌తి (నెపోలియ‌న్‌)కి చెప్పి వెళ్లాల‌ని వైజాగ్ వ‌స్తాడు. కానీ తండ్రి వైజాగ్‌లో పేరు మోసిన ముఠా నాయ‌కుడు. అత‌నితో క‌లిసి వంద మంది సైన్యం వుంటుంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి సుపారి తీసుకుని హ‌త్య‌లు చేయ‌డం ఈ సైన్యానికి స‌ర్వ‌సాధార‌ణం. ఇది సుల్తాన్‌కు ఏమాత్రం న‌చ్చ‌దు. అది న‌చ్చ‌ని సుల్తాన్ తండ్రికి చెప్పి ముంబై వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఈ క్ర‌మంలో సేతుప‌తి అక‌స్మాత్తుగా చ‌నిపోతాడు. దీంతో వంద మంది సైన్యం బాధ్య‌త‌ల్ని తండ్రి కిచ్చిన మాట కోసం సుల్తాన్ తీసుకుంటాడు. వెల‌గ‌పూడి గ్రామ పెద్ద‌ల‌కు సుల్తాన్ తండ్రి ఇచ్చిన మాట కోసం వంద మంది సైన్యంతో క‌లిసి సుల్తాన్ వెల‌గ‌పూడి వెళ‌తాడు. అక్క‌డే రుక్మిణిని చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో ఆ ఊరి వారిని హింసిస్తున్న జ‌యేంద్ర (కేజీఎఫ్ ఫేమ్ రామ‌చంద్ర‌రాజు)తో త‌ల‌ప‌డ‌తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? జ‌యేంద్ర వెన‌కున్న బిగ్ షాట్ ఎవ‌రు? . ఎందుకు ఆ ఊరి ప్ర‌జ‌ల్ని ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారు? .. సుల్తాన్‌ని విడిచి వంద మంది సైన్యం ఎందుకు వెళ్లిపోయింది? ఈ క్ర‌మంలో ఒంట‌రి వాడైన సుల్తాన్ చివ‌రికి త‌న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకున్నాడా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న:

మాస్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో కార్తీకున్న ప్ర‌త్యేక‌త వేరు. అలాంటి త‌న‌కి సుల్తాన్ లాంటి మాస్ పాత్ర ల‌భిస్తే దాన్ని ర‌క్తికట్టించ‌డంతో త‌న మార్కుని చూపించ‌డూ.. ఈ సినిమాలోని సుల్తాన్ పాత్ర విష‌యంలోనూ కార్తి అదే పం్థాను అనుస‌రించి స‌ల్తాన్ పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. పోరాట ఘ‌ట్టాల్లో కార్తీ హీరోయిజం మాస్ ఆడియ‌న్స్ చేత విజిల్స్ వేయించేలా వుంది. ఇక ర‌ష్మిక‌తో వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ చ‌క్క‌ని న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించి న‌వ్వించాడు.కార్తీని ఆట‌ప‌ట్టించే పాత్ర‌లో ప‌ల్లెటూరి అమ్మాయిగా ర‌ష్మిక చ‌క్క‌గా ఒదిగిపోయింది. మిగ‌తా పాత్ర‌ల్లో నెపోలియ‌న్‌, లాల్‌, అభిరామి, `కేజీఎఫ్` ఫేమ్ రామ‌చంద్ర‌రాజు, యోగిబాబు, స‌తీష్‌, హ‌రీష్ పెరాది, న‌వాబ్ షా, అర్జ‌ల్‌, సింగంపులి త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించారు. ‌

సాంకేతిక నిపుణులు:

మాస్ అంశాలు పుష్క‌లంగా వున్న క‌థ‌ని ఎంచుకుని దానికి స‌రికొత్త నేప‌థ్యాన్ని జోడించి ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో ద‌ర్శ‌కుడు బ‌క్కియ‌రాజ క‌న్న‌న్ తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌ధానంగా యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని మ‌లిచిన తీరు మెప్పిస్తుంది. న‌రిడివి కొంచెం ఎక్కువైన‌ట్టుగా అనిపించినా త‌న‌దైన క‌థ‌నంతో యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. వివేక్ మెర్విన్ పాట‌లు, స‌త్య‌న్ సూర్య‌న్ ఫొటోగ్ర‌ఫీ ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇక యువ‌న్ శంక‌ర్ రాజా అందించిన నేప‌థ్య సంగీతం ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ :

కార్తీ, ర‌ష్మిక మంద‌న్నల న‌ట‌న‌
స్టోరీ
ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌
యువ‌న్ శంక‌ర్ రాజా నేప‌థ్య సంగీతం
స‌త్య‌న్ సూర్య‌న్ ఫొటోగ్ర‌ఫీ
యాక్ష‌న్ ఘ‌ట్టాలు

తీర్పు: ‌

`సుల్తాన్‌` ఓ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. 100 మంది కౌర‌వ సైన్యానికి కృష్ణుడు తోడైతే అనే ఆలోచ‌న నేప‌థ్యంలో కొత్త పంథాలో ద‌ర్శ‌కుడు అల్లుకున్న క‌థ ఇది. అదే సైన్యంలో తండ్రి ఇచ్చిన మాట కోసం ఊరికి అండ‌గా నిల‌బ‌డే ఓ యువ‌కుడి క‌థ‌గా దీన్ని తీర్చి దిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు బ‌క్కియ‌రాజ క‌న్న‌న్ స‌క్సెస్ అయ్యాడు. ఇలాంటి క‌థ‌ని తెర‌పైకి ఆవిష్క‌రించ‌డం ద‌ర్శ‌కుడికి స‌వాలే అయినా దాన్ని చ‌క్క‌గా నిర్వ‌ర్తించి అంద‌రినీ ఆక‌ట్టుకునేలా చేశాడు. రోమాంచిత‌మైన మాస్ మ‌సాల ఎంట‌ర్‌టైన‌ర్‌లు ఇష్ట‌ప‌డే ప్ర‌తీ ప్రేక్ష‌కుడినీ ఆక‌ట్టుకునే చిత్ర‌మిది.