‘నారప్ప సినిమా న్యూస్’ తెలుగు అసురన్

October 09, 2020 03:59: AM

వైవిధ్యభరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విక్టరీ వెంకటేష్ మరోసారి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశారు. తమిళ ‘అసురన్’.. తెలుగులో ‘నారప్ప’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఎఫ్ 2’, ‘వెంకీమామ’ వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్.. తమిళ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన అసురన్ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండటంతో టైటిల్‌ని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

తాజాగా విడుదలైన ‘నారప్ప’ పోస్టర్స్‌లో వెంకటేష్ ఉగ్రరూపం దాల్చారు. ఊర మాస్ గెటప్‌లో వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ ప్రైజ్ చేశారు. తమిళ్‌లో ఈ పాత్రను ధనుష్ చేయగా.. తెలుగులో వెంకటేష్ అనేసరికి చాలా మందికి సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి తగ్గట్టు ‘బ్రహ్మోత్సవం’ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్‌కి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటన్నింటికీ ఈ టైటిల్ పోస్టర్‌తో సమాధానం ఇచ్చారు వెంకటేష్.

వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జనవరి 22 నుంచి 3వారాల పాటు తొలి షెడ్యూల్ జరగనుంది. రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.